ప్రాణం తీసిన పాత కక్షలు

రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు ఓ మహిళను హతమార్చేలా చేశాయి. ఓ కుటుంబంపై ప్రత్యర్థి కుటుంబం మారణాయుధాలతో చేసిన హత్యాకాండలో తల్లి అక్కడిక్కడే ప్రాణాలు వదిలితే ఆమె కొడుకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తల్లి కొండ్రు దుర్గ (45) ఘటనా స్థలంలోనే హత్యకు గురైతే కొడుకు రమేష్‌ను కత్తులతో తీవ్రంగా గాయపరిచారు.

అమలాపురం రూరల్‌ మండలం సమనస గ్రామంలో కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవి కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల నేపథంలో ఈ హత్య శుక్రవారం సాయంత్రం అమలాపురం ఎన్టీఆర్‌ మార్గ్‌లో జరిగింది. అమలాపురం రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు, సమనస గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

కోటేశ్వరరావు, చిరంజీవి ఇళ్లు సమనస గ్రామంలో ఎదురెదురుగా ఉంటాయి. ఈ రెండు కుటుంబాల మధ్య గతం నుంచి వివాదాలు, ఘర్షణలు జరుగుతుండడంతో కక్షలు బాగా బలపడిపోయాయి. ఈ క్రమంలో చిరంజీవి కొడుకు విజయ్‌ సమనస గ్రామంలోనే ప్రత్యర్థి కోటేశ్వరరావుపై మారణాయుధంతో దాడి చేయబోయాడు. కోటేశ్వరరావు కూడా తిరగబడినప్పటికీ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ సమాచారాన్ని విజయ్‌ తన తండ్రి చిరంజీవికి ఫోన్‌ చేసి కోటేశ్వరరావుపై నేను దాడి చేస్తే పారిపోయాడు.

కోటేశ్వరరావు భార్య దుర్గ, కొడుకు రమేష్‌ అమలాపురం నుంచి కొద్దిసేపట్లో బయలుదేరి సమనస వస్తారు. మనం దారి కాసి దాడి చేయాలని చెప్పాడు. దీంతో చిరంజీవి, అతని కొడుకులు విజయ్, నవీన్, చిరంజీవి భార్య బేబి వారికున్న మినీ వ్యాన్‌లో అమలాపురం మారణాయుధాలతో బయలుదేరారు. ఇదే సమయంలో కోటేశ్వరరావు తన కుమారుడు రమేష్‌కు ఫోన్‌ చేసి.. తల్లి దుర్గను మోటారు సైకిల్‌పై తీసుకురావాలని చెప్పడంతో తల్లీ కొడుకు ఇంటికి బయలు దేరారు.