అప్పు తిరిగివ్వలేదని దారుణ హత్య

తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని స్నేహితుడ్ని దారుణంగా హత్య చేసాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థానే జిల్లా, ఉల్హాస్‌నగర్‌కు చెందిన సోను, ఫాహిమ్‌ ఓ జీన్స్‌ తయారీ కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఫాహిమ్‌, సోను దగ్గర 400 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు తీర్చడానికి ఫాహిమ్‌ సుముఖత చూపలేదు.

దీంతో తరచుగా స్నేహితులిద్దరికీ గొడవలయ్యేవి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా గొడవైంది. సోను, ఫాహిమ్‌ను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.