15 మంది కోవిడ్‌ బాధితుల మృత్యువాత

గోవా మెడికల్‌ కళాశాల ఆస్పత్రి(జీఎంసీహెచ్‌)లో ఆక్సిజన్‌ అందక గురువారం మరో 15 మంది కోవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు. పెద్ద ఆక్సిజన్‌ సిలింండర్‌కు అనేక చిన్న సిలిండర్లను కలపడంలో తలెత్తిన లోపాల వల్లే వీరిలో కొందరు చనిపోయిన భావిస్తున్నామని రాష్ట్ర అధికారులు బాంబే హైకోర్టు గోవా ధర్మాసనానికి తెలిపారు.

అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వీరు తుదిశ్వాస విడిచారని తెలిపారు. జీఎంసీహెచ్‌లో చికిత్స పొందే కోవిడ్‌ బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను సక్రమంగా అందించాలని తాము ఉత్తర్వులిచ్చిన తర్వాత కూడా ఇలాంటి విషాదం సంభవించడంపై ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మూడు రోజుల క్రితం, మే 12న ఇదే ఆస్పత్రిలో 26 మంది కరోనా రోగులు ఆక్సిజన్‌ అందక మృతి చెందడంపై దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారించింది. ఈ సందర్భంగా తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్‌ సరఫరాను అందుబాటులో ఉంచాలని జస్టిస్‌ నితిన్‌ సాంబ్రే, జస్టిస్‌ ఎంఎస్‌ సోనక్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.