ప్రేమను నిరాకరించిందని క్లాస్‌మేట్ అయిన ఓ యువకుడు పాడుపనికి తెగబడ్డాడు. స్నేహితురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి ఏకంగా డేటింగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, బాధితురాలి ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ యువతికి మానసిక వేధింపులు తప్ప లేదు. అసలేం జరిగిందో పసిగట్టిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించి, ఆ పోకిరీకి తగిన బుద్ధి చెప్పింది.కింగ్‌కోఠికి చెందిన మహమ్మద్ సమీర్ ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది విద్యార్థి. తన క్లాస్‌మేట్ అయిన యువతితో కొంత కాలం అతను స్నేహంగా మెలిగేవాడు. రోజూ చాటింగ్ చేసుకునేవారు. దాన్ని అలుసుగా తీసుకున్న సమీర్ ప్రేమిస్తున్నా అని వెంటపడ్డాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమె దూరం జరిగింది. వాళ్లిద్దరి మధ్య మాటలు కూడా కరువయ్యాయి.యువతి నుంచి ప్రేమ నిరాకరణతో పాటు మాట్లాడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకున్నాడు. తన స్మార్ట్ ఫోన్ ద్వారా లోకాంటో డేటింగ్ వెబ్‌సైట్‌లో నకలీ జిమెయిల్ అకౌంట్ సృష్టించాడు. అశ్లీల ఫొటోకు ఆమె పేరు, ఫోన్ నంబర్లను జోడించి కాల్ గర్ల్‌గా చూపించి, డేటింగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ యువతికి ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. మానసికంగా కుంగిపోయింది.తనకీ విధంగా జరగడానికి కారణం ఏంటో ఆమె గ్రహించింది. వెంటనే ఆ యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. యువతి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు వివరాలు సేకరించి, అసలు నిందితుడెవరో వెంటనే నిర్ధారణకు వచ్చారు. సమీర్‌ను అరెస్టు చేసి అతని వద్ద స్మార్ట్‌ఫోన్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. స్నేహితుడని నమ్మి మాట్లాడితే, చివరికి ఆమెను బద్నాం చేయాలనే సమీర్ ప్రయత్నాలకు పోలీసులు మొదట్లోనే చెక్ పెట్టారు.
