హైదరాబాద్: ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ టెస్ట్‌లో టీమిండియా గెలిచిన తర్వాత దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని గర్వంతో ఉప్పొంగిపోయారు. 32 ఏళ్లుగా ఓటమే ఎరుగని గబ్బాలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్‌ను గెలవడం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేనిదే. ఈ విజయం చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా దీనికి అతీతమేమీ కాదు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత తాను కంటతడి పెట్టినట్లు లక్ష్మణ్ చెప్పాడం విశేషం.
రెండుసార్లే ఇలా..
స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మ్యాచ్ తాలూకు అనుభవాలను లక్ష్మణ్ పంచుకున్నాడు. ఇది చాలా గొప్ప విజయం. నేను కూడా మ్యాచ్ చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాను. చివరి రోజు కుటుంబంతో కలిసి మ్యాచ్ చూశాను. పంత్, వాషింగ్టన్ ఆడుతున్న సమయంలో చాలా ఆందోళనకు గురయ్యాను. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశాను. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై గెలవాలన్నది నా కల. ఓ క్రికెటర్‌గా అది నాకు తీరని కోరికగానే మిగిలిపోయింది. కానీ యంగిండియా చేసి చూపించడం చాలా గర్వంగా అనిపించింది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. క్రికెట్ చూస్తూ నేను కంటతడి పెట్టింది రెండుసార్లే. ఇంతకుముందు 2011 వరల్డ్‌కప్ గెలిచినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఆ టీమ్‌లోని ప్రతి ఒక్కరితో కలిసి ఆడాను. వాళ్లంతా తమ కలలను సాకారం చేసుకోవడం చూసి భావోద్వేగానికి లోనయ్యాను అని లక్ష్మణ్ చెప్పాడు. గబ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్ గెలవాలని తాను భావించినట్లు లక్ష్మణ్ తెలిపాడు.