బ్రిస్బేన్ : గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా ఓడిపోవడమా. ఇది నమ్మలేని నిజం. అజేయ ఆస్ట్రేలియాను ఓడించింది టీమిండియానే. హేమాహేమీలు ఉన్న వెస్టిండీస్ జట్టు.. 1988లో గబ్బా మైదానంలో టెస్టు మ్యాచ్‌ను గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టును ఆ గడ్డపై దెబ్బతీసిన జట్టేదిలేదు. కానీ తాజా సిరీస్‌లో టీమిండియా అనూహ్య రీతిలో తన సత్తా చాటింది. అత్యంత బలంగా ఉన్న ఆసీస్ జట్టుకు జలక్ ఇచ్చింది. అపూర్వమైన రీతిలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను సొంతం చేసుకున్నది. నిజానికి గబ్బా అంటే ప్రత్యర్థులకు హడల్. ఈ పిచ్‌పై మ్యాచ్ ఆడాలంటే.. విదేశీ ఆటగాళ్లు వణికిపోతారు. బెంబేలెత్తించే బౌన్సర్లు.. రోజులు మారుతుంటే మెలికలు తిరిగే ఈ పిచ్‌పై .. ఎవరు ఆడాలన్నా గజగజలాడిపోతారు. కానీ రహానే నేతృత్వంలోని టీమిండియా ప్లేయర్లు అసాధారణ రీతిలో అసమాన ప్రతిభను ప్రదర్శించింది. గబ్బా మైదానంలో స్వంత ప్లేయర్లనే గజగజ వణికించారు.
1980 దశకంలో పటిష్టమైన వెస్టిండీస్ జట్టు మాత్రమే ఈ పిచ్‌పై విజయం సాధించినట్లు రికార్డు ఉన్నది. 1988వ సంవత్సరంలో మైటీ విండీస్ ఆ ఘనతను దక్కించుకున్నది. ఆ సమయంలో విండీస్ జట్టులో మాల్కమ్ మార్షల్, ప్యాట్రిక్ ప్యాటర్‌సన్, కర్ట్‌లీ ఆంబ్రూస్, కర్ట్నీ వాల్ష్ లాంటి మేటి బౌలర్లు ఉన్నారు. మరోవైపు ఆసీస్ జట్టులో కైలీ మినోగ్, రిక్ ఆస్లే, రాబర్ట్ పామర్, బిల్లీ ఓసియన్ లాంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అయితే 33 ఏళ్ల తర్వాత గబ్బా కోటను టీమిండియా బద్దలు కొట్టడం క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎక్కువ శాతం యువ ఆటగాళ్లు ఉన్న జట్టుతో ఈ విజయాన్ని అందుకోవడం మరీ ప్రత్యేకం. అయితే ఈ సిరీస్‌లో భారత్ 20 ఆటగాళ్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది. విరాట్ మధ్యలో వెళ్లిపోవడం.. ఆ తర్వాత కొందరు ఆటగాళ్లకు గాయాలు కావడం.. స్కానింగ్‌కు వెళ్లిన ప్లేయర్లు టూర్ నుంచి తప్పుకోవడం.. ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొన్న భారత్.. బ్రిస్బేన్ టెస్టులో సుమధురమైన విజయంతో గబ్బా కోటను బద్దలు కొట్టింది.