భారత జట్టుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు

న్యూఢిల్లీ : ఆస్ర్టేలియా గ‌డ్డ‌పై చ‌రిత్రాత్మ‌క విజ‌యం సాధించిన టీమిండియాకు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. కీల‌క ఆట‌గాళ్లు లేకున్నా అద్భుతం చేశార‌ని కేసీఆర్ ప్ర‌శంసించారు. ఈ విజ‌యం చిర‌స్మ‌ర‌ణీయంగా మిగిలిపోతుంద‌న్నారు. కెప్టెన్ ర‌హానేతో పాటు జ‌ట్టు స‌భ్యుల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

టీమిండియా ఆట‌గాళ్లు భార‌త్‌ను గ‌ర్వించేలా చేశారు అని పేర్కొంటూ రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌య‌మ‌ని పేర్కొన్నారు. 2021 సంవ‌త్స‌రాన్ని అద్భుతంగా ప్రారంభించారు అని కేటీఆర్ అన్నారు.

ఆస్ట్రేలియాపై టీమిండియా అనిత‌ర సాధ్య‌మైన విజ‌యం సాధించింది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్టింది.  3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మ‌న్ గిల్ (91), రిష‌బ్ పంత్(89 నాటౌట్‌) ఫైటింగ్ ఇన్నింగ్స్‌తోపాటు ఆస్ట్రేలియా పేస‌ర్ల బౌన్స‌ర్ల‌కు శ‌రీర‌మంతా గాయ‌ప‌డినా పోరాడిన పుజారా (56) టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించిపెట్టారు. 328 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని టీమిండియా ఛేదించ‌డం విశేషం. చివ‌రి వ‌ర‌కూ న‌రాలు తెగే ఉత్కంఠ మ‌ధ్య జ‌రిగిన ఈ మ్యాచ్‌.. టెస్ట్ క్రికెట్‌లోని అస‌లైన మ‌జాను రుచి చూపించింది.