క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్

ముంబాయి,తీస్మార్ న్యూస్: ముంబైలోని ఓ ప‌బ్‌పై పోలీసులు సోమ‌వారం రాత్రి రెయిడ్ చేశారు. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ప‌బ్ నిర్వ‌హించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో 34 మందిపై కేసు న‌మోదు చేశారు. దాంట్లో సెల‌బ్రిటీల‌తో పాటు ప‌బ్ సిబ్బంది కూడా ఉన్నారు. మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనాను కూడా అరెస్టు చేశారు. 27 మంది క‌స్ట‌మ‌ర్లు, ఏడు మంది సిబ్బందిపై కేసు దాఖ‌లు చేశారు. ముంబై విమానాశ్ర‌యం స‌మీపంలో ఉన్న స‌హ‌ర్ ప్రాంతంలో ఆ ప‌బ్ ఉన్న‌ది. నిర్ణీత స‌మ‌యం దాటి ప‌బ్‌ను ఓపెన్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. మాస్క్‌లు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టాన్స్ పాటించ‌క‌పోవ‌డం లాంటి ఉల్లంఘ‌న‌ల‌కు కూడా పాల్ప‌డ్డారు. ప్ర‌స్తుతం ముంబైలో రాత్రి 11.30 వ‌ర‌కే ప‌బ్‌ల‌కు తెరిచే ప‌ర్మిష‌న్ ఉన్న‌ది. కానీ స‌హ‌ర్ ప్రాంతంలోని ప‌బ్ తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు కూడా తెరిచి ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. తెల్ల‌వారుజామున‌ 2.50 నిమిషాల‌కు ముంబై పోలీసు శాఖ‌కు చెందిన స్పెష‌ల్ స్వ్కాడ్ ఆ ప‌బ్‌పై త‌నిఖీ నిర్వ‌హించారు. తాజాగా క‌రోనా నిబంధ‌న‌ల నేప‌థ్యంలో రాత్రి పూట 11 నుంచి ఉద‌యం 6 వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో క‌ర్ఫ్యూ విధించారు. అయితే ఆ ఆంక్ష‌ల‌ను ప‌బ్ నిర్వాహాకులు అతిక్ర‌మించిన‌ట్లు పోలీసులు చెప్పారు.

రైనా విడుదల..

డ్రాగ‌న్‌ఫ్లై క్ల‌బ్‌లో సురేశ్ రైనాను అరెస్టు చేశారు. మాజీ క్రికెట‌ర్‌ను ఆ త‌ర్వాత బెయిల్‌పై రిలీజ్ చేశారు. అరెస్టు అయిన సెల‌బ్రిటీల్లో రైనాతో పాటు గురు రాంధ్వా, సుశేన్ ఖాన్ కూడా ఉన్నారు. అంధేరీలోని హోట‌ల్ జేడ‌బ్ల్యూ మారియ‌ట్‌లో ఆ ప‌బ్ ఉన్న‌ది. ఐపీసీ 188 సెక్ష‌న్‌, ముంబై పోలీసు చ‌ట్టం, ఎపిడ‌మిక్ డిసీజ్ యాక్ట్ ప్ర‌కారం అరెస్టులు చేశారు. 18, 269, 34 ఐపీసీ సెక్ష‌న్ల‌తో పాటు ఎన్‌డీఎంఏ 51 సెక్ష‌న్ కింద అరెస్టు చేసిన‌ట్లు ముంబై పోలీసులు ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి ప‌ద‌వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్న స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం రైనా యూపీ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌నున్నాడు.