ఉమేశ్‌ స్థానంలో శార్దుల్‌!

సిడ్నీ: గాయం కారణంగా ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు దూరమైన పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానం కోసం ఇద్దరు బౌలర్లు పోటీపడుతున్నారు.  వచ్చే వారం ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టుకు భారత  తుది జట్టులో చోటు కోసం బౌలర్లు టీ నటరాజన్‌, శార్దుల్‌ ఠాకూర్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటరాజన్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో తగినంత అనుభవం లేకపోవడంతో శార్దుల్‌ను ఎంపిక చేసేఅవకాశాలున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి. శార్దుల్‌ వైపే టీమ్‌మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపుతోందని తెలిసింది. శార్దుల్‌ ఇప్పటి వరకు 62 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 206 వికెట్లు తీశాడు.  నటరాజన్‌ తమిళనాడు తరఫున   ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు  ఎక్కువ ఆడలేదు. నవదీప్‌ సైనీ జట్టులో ఉన్నప్పటికీ అతని గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. కొన్ని ప్రాక్టీస్‌ సెషన్ల తర్వాత బౌలర్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని సిడ్నీ టెస్టు కోసం తుది జట్టు ఎంపికపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మూడో టెస్టు   జనవరి 7 నుంచి  సిడ్నీలో  ఆరంభంకానుంది.