క‌రోనాతో హాస్పిట‌ల్‌లో చేరిన స‌చిన్

ముంబై : క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన స‌చిన్ టెండూల్క‌ర్ ఇవాళ హాస్పిట‌ల్‌లో చేరారు. మాజీ టీమిండియా క్రికెట‌ర్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. తాను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన వారికి థ్యాంక్స్ తెలిపారు. అయితే వైద్యులు ఇచ్చిన సూచ‌న మేర‌కు హాస్పిట‌ల్‌లో చేరిన‌ట్లు ఆ ట్వీట్‌లో స‌చిన్ తెలిపారు. త్వ‌ర‌లోనే క్షేమంగా ఇంటికి వ‌స్తాన‌న్న ఆశాభావాన్ని కూడా స‌చిన్ వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇంటి వ‌ద్దే సుర‌క్షితంగా ఉండాలంటూ త‌న ట్వీట్‌లో స‌చిన్ కోరారు. మార్చి 27వ తేదీన స‌చిన్‌కు క‌రోనా సంక్ర‌మించింది. ఆ రోజు ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన స‌చిన్‌.. క్వారెంటైన్‌లో ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

తాజాగా నిర్వ‌హించిన టెస్టింగ్‌లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు ఆ ట్వీట్‌లో స‌చిన్ పేర్కొన్నారు. స్వ‌ల్పంగా త‌న‌కు ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా ప‌రీక్ష‌లో నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు ఆయ‌న చెప్పారు. క‌రోనా సోక‌డం వ‌ల్ల ఇంట్లోనే క్వారెంటైన్‌లో ఉన్న‌ట్లు త‌న ట్వీట్‌లో స‌చిన్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.