87ఏండ్ల తర్వాత తొలిసారి

ముంబై:  కరోనా కారణంగా భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ-2020-21 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.  కొవిడ్‌తో ఈ ఏడాది పూర్తిస్థాయి దేశవాళీ సీజన్‌కు ఆస్కారం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. రంజీ ట్రోఫీని నిర్వహించకపోవడం 87 ఏండ్లలో ఇదే మొదటిసారి. రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల కోరిక మేరకు ఈ టోర్నీకి   బదులుగా విజయ్‌ హజారే ట్రోఫీని నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది.  ఐపీఎల్‌-2021 సీజన్‌ ఆటగాళ్ల వేలానికి ముందే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఏకకాలంలో విజయ్‌ హజారే ట్రోఫీ,  సీనియర్‌ విమెన్స్‌ నేషనల్‌  వన్డే టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని, అలాగే  అండర్‌-19 నేషనల్‌ వన్డే టోర్నీ వినూ మన్కడ్‌ ట్రోఫీ జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జే షా రాష్ట్రాల క్రికెట సంఘాలకు పంపిన లేఖలో పేర్కొన్నారు.  సయ్యద్ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర యూనిట్లకు షా తన లేఖలో కృతజ్ఞతలు తెలిపారు.