ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్సర్‌గా ఉన్న మొబైల్ ప్రిమియర్ లీగ్ (ఎంపీఎల్) సంస్థలో కోహ్లి పెట్టుబడులు ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. గతేడాది జనవరిలో ఎంపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు కోహ్లి. అప్పుడే అతని పేరిట రూ.33.32 లక్షల విలువైన 68 సీసీడీలను కేటాయించారు. వీటిని పదేళ్ల తర్వాత ఈక్విటీ షేర్లలోకి మార్చుకోవచ్చు. ఆ లెక్కన కోహ్లికి ఈ కంపెనీలో 0.051 శాతం వాటా ఉన్నట్లే. ఇదే ఎంపీఎల్ స్పోర్ట్స్‌ను గతేడాది నవంబర్ 17న అధికారిక కిట్ స్పాన్సర్‌గా బీసీసీఐ ప్రకటించింది. ఈ ఎంపీఎల్ లోగో ఉన్న జెర్సీలను ఆస్ట్రేలియా టూర్ నుంచే టీమిండియా వేసుకుంటోంది. మూడేళ్ల పాటు ఈ సంస్థతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కోహ్లికి ఈ సంస్థలో వాటా ఉన్నట్లు బీసీసీఐకి తెలియదని ఓ బోర్డు అధికారి చెప్పడం గమనార్హం. మరోవైపు కోహ్లిలాంటి టాప్ ప్లేయర్‌కు ఇలాంటి కనెక్షన్లు ఉండటం సరి కాదని మరో అధికారి అన్నారు. నిజానికి గతేడాది జులైలోనే కోహ్లి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ లేవనెత్తారు. మరి ఈ అంశంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.