చెన్నైకి చేరుకున్న ఇంగ్లండ్ టీం

చెన్నై: ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు ఇవాళ చెన్నై చేరుకున్న‌ది.  భార‌త్‌తో ఇంగ్లండ్ జ‌ట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నున్న‌ది.  తొలి టెస్టు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో జ‌ర‌గ‌నున్న‌ది.  ఈ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన ప్రారంభం కానున్న‌ది.  శ్రీలంక‌తో ఇటీవ‌ల జ‌రిగిన రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ గెలిచింది.  ఇంగ్లండ్ జ‌ట్టు నేరుగా శ్రీలంక నుంచి భార‌త్‌కు వ‌చ్చింది.  విమానాశ్ర‌యంలో ఆట‌గాళ్లు కోవిడ్ ప‌రీక్ష‌లు చేశారు.  టీమిండియా కూడా ఇటీవ‌లే ఆసీస్ టూర్‌ను విజ‌య‌వంతంగా ముగించిన విష‌యం తెలిసిందే. భార‌త క్రికెట‌ర్లు కూడా ఇవాళ చెన్నై చేరుకుంటారు.  కోవిడ్ నేప‌థ్యంలో ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు ఆరు రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంటారు.  జో రూట్ నేతృత్వంలోని 32 మంది స‌భ్యులు ఈ టూర్‌లో పాల్గొన‌నున్నారు. క్రికెట‌ర్ల కోసం బ‌యోసెక్యూర్ వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశారు.  కేవ‌లం హోట‌ల్‌, గ్రౌండ్ మ‌ధ్య ఆట‌గాళ్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు.  వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగానే ఇంగ్లండ్‌, ఇండియా మ‌ధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.