డీసీ వ‌ర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌ డౌటే !

ముంబై : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ స్టార్ట్ కావ‌డానిక మ‌రో వారం రోజుల స‌మ‌య‌మే ఉంది. అయితే ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో పని చేస్తున్న గ్రౌండ్ సిబ్బందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఆ స్టేడియంలో గ్రౌండ్స్‌మెన్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న 19 మందిలో 8 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చింది. దీంతో చెన్నై, ఢిల్లీ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానున్న‌ది. ఇక ఏప్రిల్ 10 నుంచి 25 మ‌ధ్య‌ వాంఖ‌డే స్టేడియంలో 10 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ స్టేడియంలో ఉన్న 19 మంది గ్రౌండ్ సిబ్బంది ఉండ‌గా వారికి ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. మార్చి 26వ తేదీన దాంట్లో ముగ్గురు పాజిటివ్‌గా తేలారు. ఏప్రిల్ ఒక‌టిన మ‌రో అయిదుగురు పాజిటివ్ వ‌చ్చారు. బ‌యో బ‌బుల్ వాతావ‌ర‌ణంలో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నా.. గ్రౌండ్స్‌మెన్‌కు వైర‌స్ సంక్ర‌మించ‌డం మ‌హారాష్ట్ర‌లో వైర‌స్ తీవ్ర‌త‌ను చూపుతున్న‌ది. ప్ర‌స్తుతం ముంబైలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌మ బేస్‌ను ఏర్ప‌ర్చుకున్నాయి. మ‌హారాష్ట్ర‌లో కోవిడ్ కేసులు అధికం కావ‌డం వ‌ల్ల ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారా లేదా బీసీసీఐ తేల్చాల్సి ఉంటుంది.