మాజీ క్రికెటర్ కారుకు ప్రమాదం

జైపూర్‌: రోడ్డు ప్రమాదం నుంచి భారత మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌   (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ తృటిలో తప్పించుకున్నాడు. జైపూర్‌ సమీపంలోని సవాయ్‌ మాదోపూర్‌ జిల్లాలో బుధవారం జరిగిన ప్రమాదంలో అజర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. రతన్‌బోర్‌కు వెళుతున్న క్రమంలో అదుపుతప్పిన అజర్‌ కారు రోడ్డు పక్కకు ఉన్న దాబాలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న హోటల్‌ సిబ్బందిలో ఒక్కరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని దవాఖానకు తరలించామని, అజర్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు మరో కారులో రతన్‌బోర్‌కు బయల్దేరినట్లు పోలీస్‌ అధికారి చంద్రభాన్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదంపై అజర్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘ఈ రోజు ప్రమాదం నుంచి బయటపడ్డాను. దేవుడి దయతో ప్రస్తుతానికి బాగున్నాను. నా యోగ క్షేమాల గురించి ఆరా తీసిన అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశాడు.