స్ట్రెయిన్ ప్రభావం.. విలవిల్లాడుతున్న జనం

కరోనా వచ్చిన తొలినాళ్లలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి ప్రభుత్వాలు. లాక్ డౌన్ ఎఫెక్ట్ నెలల తరబడి ఉంటుందని తెలియక.. చాలామంది భారతీయులు ఇతర దేశాల్లోనే ఉండిపోయారు.పరిస్థితులు చక్కబడుతున్న టైమ్ కి వీరందరికీ ఓ సత్యం బోధపడింది. ఇతర దేశాల కంటే కరోనాని భారత్ మాత్రమే సమర్థంగా ఎదుర్కోగలిగిందని, అందుకే ఇక్కడికి వచ్చేయాలని తాపత్రయ పడుతున్నారంతా.విదేశాలతో పోల్చి చూస్తే.. కరోనా మరణాల శాతం భారత్ లో బాగా తక్కువ. ప్రపంచం మొత్తంలో కరోనా మరణాల రేటు 2.15 కాగా.. భారత్ లో కేవలం 1.45. అంటే కరోనా విషయంలో భారత్ అత్యంత సురక్షిత ప్రదేశం అన్నమాట. అయితే వలస కార్మికుల వెతలు, ఉద్యోగుల ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు మాత్రం ఇతర దేశాలతో పోల్చితే మన దగ్గరే ఎక్కువగా ఉన్నాయి.

స్ట్రెయిన్ ప్రభావం.. విలవిల్లాడుతున్న జనం

బ్రిటన్ పుట్టినిల్లుగా చెబుతున్న కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రభావం ఇప్పుడు ఇతర దేశాలపై కూడా పడింది. దక్షిణాఫ్రికా సహా బ్రిటన్ చుట్టుపక్కల దేశాలన్నీ కొత్త రకం కరోనా బారిన పడ్డాయి. భారత్ లో కూడా దీని విలయం మొదలైంది. అమెరికాలో కూడా తొలి కేసు బైటపడింది. దీంతో విదేశాల్లో ఉన్న భారతీయులంతా ఈ దఫా సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేయడానికి ఇష్టపడుతున్నారు.నేరుగా బ్రిటన్ నుంచి రవాణా సౌకర్యం లేకపోవడంతో.. ఏదో ఒక మార్గంలో ఇతర ప్రాంతాలకు వచ్చి అక్కడినుంచి భారత్ కి తిరిగి ప్రయాణం కడుతున్నారు. ప్రయాణ ఖర్చులు కాస్త ఎక్కువైనా సరే సొంత దేశానికి వచ్చేందుకే అందరూ ఇష్టపడుతున్నారు. ఏళ్ల తరబడి విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈసారి భారత్ కి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.లాక్ డౌన్ ని ఇతర అన్ని దేశాలు సమర్థంగా అమలు చేసినా కూడా.. భారత్ లోనే కరోనా మరణాలు తక్కువగా ఉండటం సంతోషకరమైన విషయం. ఈ కారణంతోనే ఎన్నారైలంతా భారత్ బాట పడుతున్నట్టున్నారు.

స్ట్రెయిన్ విరుచుకుపడినా భారత్ మేలు..

చైనా కరోనా భారత్ ని కూడా గడగడలాడించింది. బ్రిటన్ స్ట్రెయిన్ కూడా భారత్ ని ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే భారత్ లో దాదాపు 20 కేసులు నమోదయ్యాయని అనధికారిక సమాచారం. ఏపీలో ఒక కేసు వెలుగు చూసింది. ఈ దశలో భారత్ లో కూడా స్ట్రెయిన్ పంజా విసిరినా.. దాని ప్రభావం తక్కువగానే ఉంటుందనే నమ్మకం అందరిలో ఉంది. అందుకే ఈ దఫా ఎన్నారైలంతా స్వదేశీ మంత్రం జపిస్తున్నారు.