ఢిల్లీలో కొత్త రకం కరోనా

న్యూఢిల్లీ: బ్రిటన్‌ నుంచి దేశానికి వచ్చిన వారిలో మరో నలుగురికి కొత్త రకం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో 38 మందికి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. వీరిలో నలుగురికి బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కరోనా బారిన పడిన వీరిని ఎల్‌ఎన్‌జేపీ దవాఖానలోని ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందించినట్లు వివరించారు. కరోనా సోకిన వారిని కలిసిన వ్యక్తులను కూడా గుర్తించి పరీక్షలు జరిపామని తెలిపారు. అయితే కొత్తగా ఎవరికీ కరోనా సోకలేదని, బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో నలుగురికి తప్ప మరెవరికీ కొత్త రకం కరోనా వ్యాప్తి చెందలేదని మీడియాకు వెల్లడించారు. బ్రిటన్‌ నుంచి విమానాలు రద్దు కావడంతో కొత్తగా ప్రయాణికులు ఎవరూ కూడా ఢిల్లీకి రాలేదని చెప్పారు.