సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించాలి

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదే విషయాన్ని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేదని హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

కరోనా మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక పరిష్కారం అని స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గేందుకు లాక్‌డౌనే ఉత్తమ మార్గమని పునరుద్ఘాటించారు. మంగళవారం ఓ జాతీయ మీడియాతో గులేరియా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి మూడు మార్గాలు ఆయన సూచించారు.

ఈ చర్యలు తీసుకుంటే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. ‘ప్రజల ఆరోగ్య దృష్ట్యా పాలకులు లాక్‌డౌన్‌లాంటి చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలకే లాక్‌డౌన్‌ పరిమితమైతే అమెరికా మాదిరి మన దేశంలో పరిస్థితి ఉంటుంది. లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలి. నిర్ణీత కాలం పాటు లాక్‌డౌన్‌ విధించాలి. కనీసం రెండు వారాలైనా సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.