వరంగల్ జిల్లాలో కొత్త కరోనా కలకలం

రాష్ట్రంలోకి కొత్త కరోనా ఎంటరైంది. వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తికి బ్రిటన్​ స్ట్రెయిన్​ వైరస్​ సోకినట్టు హైదరాబాద్‌ సీసీఎంబీ సైంటిస్టులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్టేట్‌, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీలకు రిపోర్ట్‌ చేశారు. హెల్త్ డిపార్ట్‌ మెంట్‌లోని కీలక అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే కొత్త స్ట్రెయిన్​ గురించి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని, అప్పటివరకు అఫీషియల్​గా వెల్లడించలేమని పేర్కొన్నారు. కొత్త స్ట్రెయిన్​ సోకిన ఈ వ్యక్తి ఈ నెల రెండో వారంలో బ్రిటన్​ నుంచి వరంగల్‌‌‌‌ కు వచ్చారు. బ్రిటన్​ రిటర్నీస్‌‌‌‌ అందరికీ టెస్టులు చేయించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు, రాష్ట్ర హెల్త్​ ఆఫీసర్లు ఈ నెల 24న ఆయనకు టెస్టులు చేయించారు. కరోనా పాజిటివ్‌‌‌‌గా రావడంతో శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు. ఆ వ్యక్తికి సోకినది బ్రిటన్​లో వేగంగా వ్యాపిస్తున్న స్ట్రెయిన్​ అని సీసీఎంబీ సైంటిస్టులు తేల్చారు. అయితే మరోసారి జీనోమ్‌‌‌‌ సీక్వెన్సింగ్ టెస్టు కోసం ఆ వ్యక్తి శాంపిళ్లను, మరికొందరు బ్రిటన్​ రిటర్నీస్‌‌‌‌ శాంపిళ్లను పుణెలోని వైరాలజీ ల్యాబుకు పంపినట్టు తెలిసింది.

ప్రైవేటు హాస్పిటల్లో పేషెంట్స్:

బ్రిటన్ స్ట్రెయిన్​ సోకిన వ్యక్తి వయసు 49 ఏండ్లు అని, ఆయన నుంచి తల్లికి వైరస్ వ్యాపించిందని అధికారులు తెలిపారు. శనివారం చేసిన టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చిందని, ఆ శాంపిల్స్​ను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపామన్నారు. కొత్త కరోనా వచ్చిన వ్యక్తితో ముగ్గురు మాత్రమే కాంటాక్ట్​ అయ్యారని అధికారులు గుర్తించారు. అందులో ఆయన తల్లికి పాజిటివ్​గా తేలింది. అయితే ఆమె ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వరంగల్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. ఇతర పేషెంట్లతో కలవకుండా సెపరేట్ వార్డులో ఉంచారు. వారి హెల్త్​ కండిషన్​ నార్మల్​గానే ఉందని, వైరస్ లక్షణాలు ఎక్కువగా లేవని ఆ ప్రైవేట్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బ్రిటన్​ స్ట్రెయిన్​ సోకిన వారిని ప్రైవేటు హాస్పిటల్లో ఉంచడం ఏమిటని ప్రభుత్వ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కొత్త వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుందని తెలిసి కూడా ప్రైవేటుకు పంపించడమేంటని పేర్కొంటున్నారు. నిజానికి బ్రిటన్​ రిటర్నీస్‌‌‌‌ లో పాజిటివ్ వచ్చిన వారిని ఉంచేందుకు.. వరంగల్ ఎంజీఎంలో ఏర్పాట్లు చేసినట్టు స్టేట్ హెల్త్ ఆఫీసర్లు ఈమధ్యే చెప్పారు కూడా. అయితే ఈ విషయంపై వరంగల్ హెల్త్ ఆఫీసర్లను ప్రశ్నించగా పేషెంట్ ఇష్టప్రకారమే ప్రైవేట్‌‌‌‌లో ట్రీట్​మెంట్​ చేయించుకుంటున్నాడని అన్నారు.