టీకాపై అపోహలు వద్దు:మంత్రి ఈటల

హైదరాబాద్‌ : కరోనా టీకాపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు మొదటి టీకాను తానే వేసుకోనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి ఈటల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు భయపడొద్దు. ఆ భయాన్ని పోగొట్టడానికి వైద్యారోగ్య శాఖకు కెప్టెన్‌గా తొలిటీకాను నేను తీసుకుంటున్నా’ అని ప్రకటించారు. ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికుల నుంచి మొదలు ఉన్నతాధికారుల వరకు టీకా వేయబోతున్నట్టు చెప్పారు. టీకా పనిచేస్తుందా? లేదా? అనే అనుమానాలు వద్దన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అన్ని దేశాల అధినేతలు మానవ కల్యాణం కోసం శ్రమించారని చెప్పారు. ఈ జీనోమ్‌ యుగంలో ఒక వైరస్‌ వల్ల ప్రజలు ఇబ్బంది పడొద్దనే.. వేల కోట్లు ఖర్చు పెట్టి టీకాను అభివృద్ధి చేశారని చెప్పారు.

పెన్సిలిన్‌కు కూడా రియాక్షన్‌ ఉంటది

ప్రతి టీకాకు రియాక్షన్లు ఉంటాయని మంత్రి ఈటల చెప్పారు. పెన్సిలిన్‌ ఇచ్చేముందు కొంత ఇచ్చి టెస్ట్‌ చేస్తారని గుర్తుచేశారు. పెన్సిలిన్‌ కోట్ల మందికి ప్రాణ భిక్ష పెడుతున్నదని, అలాంటి మందు కూడా కొందరికి రియాక్షన్‌ ఇస్తుందని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా తీసుకునేవారికే టీకా వేస్తామని స్పష్టం చేశారు.

ముందు ప్రభుత్వ సిబ్బందికి..

టీకా మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తరువాత రెండో డోసు తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపారు. కేంద్రం ప్రస్తుతం అందించిన డోసులు ప్రభుత్వ దవాఖానల సిబ్బందికి సరిపోతాయన్నారు. మరిన్ని డోసులు అందిన తర్వాత ప్రైవేట్‌ దవాఖానలకు, దీర్ఘకాలిక రోగులకు, 50 ఏండ్లకు పైబడినవారికి అందజేస్తామని చెప్పారు.