డేంజ‌ర్ బెల్స్‌..

న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తరకం కరోనా వైరస్‌ రకాలు (స్ట్రెయిన్లు) మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రెట్టింపు స్థాయిలో ఉత్పరివర్తనం చెందిన కొత్త వైరస్‌ను (న్యూ డబుల్‌ మ్యూటెంట్‌ వేరియెంట్‌ను) మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తాజాగా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. అలాగే, 18 రాష్ర్టాల్లో ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్న కొత్తరకం వైరస్‌ రకాలను గుర్తించినట్టు వివరించింది. ఇందులో కొన్ని స్ట్రెయిన్లు బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో గుర్తించిన వైరస్‌ రకానికి చెందినవని, వాటి తీవ్రత ఆందోళన కలిగిస్తున్నదన్నది. అయితే, ఇటీవల పెరుగుతున్న కరోనా కేసులకు ఈ కొత్త రకం వైరస్‌లే కారణమని ఇప్పుడే చెప్పలేమని వివరించింది.
మహారాష్ట్రలో భిన్నమైన వైరస్‌
మహారాష్ట్ర పంపిన వైరస్‌ నమూనాల్లో కొంత వ్యత్యాసాన్ని గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. గత డిసెంబర్‌లో పంపిన వైరస్‌ నమూనాలతో పోలిస్తే తాజాగా పంపిన నమూనాలు భిన్నంగా ఉన్నాయన్నది. ఈ నమూనాల విశ్లేషణ అనంతరం.. ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ వంటి ఉత్పరివర్తనాలకు వైరస్‌ లోనైనట్టు గుర్తించామని వివరించింది. మహారాష్ట్ర పంపిన 15-20 శాతం నమూనాల్లో ఈ ఉత్పరివర్తనాలున్నట్టు పేర్కొంది. ఎన్‌440కే ఉత్పరివర్తనం కూడా రోగనిరోధకత శక్తి నుంచి తప్పించుకొని తిరుగుతుందని, దీన్ని కేరళ పంపిన 123 వైరస్‌ నమూనాల్లో గుర్తించామన్నది. ఈ ఉత్పరివర్తనాన్ని గతంలో ఏపీ, తెలంగాణలో గుర్తించినట్టు తెలిపింది. కాగా, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో కేసులు పెరగటానికి ఈ కొత్త రకం ఉత్పరివర్తనాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌రోసారి విల‌య తాండ‌వం చేస్తోంది. ప్ర‌తి రోజూ దేశంలో న‌మోద‌వుతున్న కేసుల్లో స‌గానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇది ఇలాగే కొన‌సాగితే ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కూ మ‌హారాష్ట్ర‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 3 ల‌క్ష‌లు దాట‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అత్య‌ధికంగా పుణె జిల్లాలో (61,125), త‌ర్వాత నాగ్‌పూర్ (47,707), ముంబై (32,927)లలో అధిక కేసులు ఉన్నాయి. వ‌చ్చే 11 రోజుల్లో మ‌ర‌ణాల సంఖ్య కూడా 64 వేలు దాట‌నుంద‌ని అంచ‌నా. ప్ర‌స్త‌తం ప్ర‌తి వారం ఇన్ఫెక్ష‌న్ల సంఖ్య 1 శాతం మేర పెరుగుతోంది.
దీనిని బ‌ట్టే రానున్న రోజుల్లో కేసులు, మ‌ర‌ణాల సంఖ్య‌ను ఆరోగ్య శాఖ అంచ‌నా వేస్తోంది. ఆ లెక్క‌న వ‌చ్చే రెండు వారాల్లో రోజుకు వెయ్యి మ‌ర‌ణాలు సంభ‌విస్తాయన్న ఆ శాఖ అంచ‌నాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. బుధ‌వారం మ‌హారాష్ట్ర‌లో 31,855 కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ మ‌హారాష్ట్ర‌లో ఒకే రోజు న‌మోదైన అత్య‌ధిక కేసుల సంఖ్య ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25.65 ల‌క్ష‌లుగా ఉంది. యాక్టివ్ కేసులు 2.47 ల‌క్ష‌లు కాగా.. మ‌ర‌ణించిన వారి సంఖ్య 53,684గా ఉంది.
736 నమూనాలు బ్రిటన్‌ రకానివే
రెట్టింపు ఉత్పరివర్తనం చెందిన వైరస్‌ రకాన్ని ‘ఇండియన్‌ సార్స్‌-కొవ్‌-2 కన్సార్టియమ్‌ ఆన్‌ జీనోమిక్స్‌ (ఐఎన్‌ఎస్‌ఏసీవోజీ)’ గుర్తించిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వైరస్‌ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి, వైరస్‌ జన్యుక్రమంపై పరిశోధనలు చేయడానికి గత డిసెంబర్‌లో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ‘వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంపిన 10,787 వైరస్‌ నమూనాల్లో 771 స్ట్రెయిన్లను ఐఎన్‌ఎస్‌ఏసీవోజీ గుర్తించింది. ఇందులో 736 నమూనాల్లో బ్రిటన్‌లో గుర్తించిన బీ.1.1.7 స్ట్రెయిన్‌, 34 నమూనాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన బీ.1.351 స్ట్రెయిన్‌, ఒక నమూనాలో బ్రెజిల్‌కు చెందిన పీ.1 స్ట్రెయిన్‌ను గుర్తించాం’ అని వివరించింది. కరోనా నిబంధనలు పాటించకపోతే, ఉత్పరివర్తనానికి లోనైన వైరస్‌ ద్వారానే కాకుండా సాధారణ వైరస్‌ ద్వారా కూడా వ్యాధికి గురయ్యే ప్రమాదమున్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్సీడీసీ) డైరెక్టర్‌ ఎస్కే సింగ్‌ తెలిపారు.
డబుల్‌ మ్యుటేషన్‌ అంటే ఏమిటి?
ఉత్పరివర్తనం చెందిన రెండు కొత్త రకం కరోనా వైరస్‌ రకాలు కలిసి మూడో రకం వైరస్‌గా ఏర్పడటాన్ని ‘వైరస్‌ రెట్టింపు ఉత్పరివర్తనం (డబుల్‌ మ్యుటేషన్‌)’ అంటారని హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. భారత్‌లో తాజాగా గుర్తించిన డబుల్‌ మ్యుటేషన్‌ వైరస్‌ ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ స్ట్రెయిన్ల కలయికతో ఏర్పడినట్టు అభిప్రాయపడ్డారు. డబుల్‌ మ్యుటేషన్‌కు లోనైన వైరస్‌ శరీరంలోని యాంటీబాడీలను ఎదుర్కోగలదని, అలాగే వ్యాక్సిన్‌ నుంచి కూడా తనను తాను రక్షించుకోగలదన్నారు. అయితే, ఎలాంటి స్ట్రెయిన్లు కలిసి డబుల్‌ మ్యుటేషన్‌ వైరస్‌ ఏర్పడిందన్న వానిపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు.