కొవిషీల్డ్ రెండో డోసు రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత ఇస్తే 90 శాతం స‌మ‌ర్థ‌వంతం

పుణె: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రెండున్న‌ర నుంచి మూడు నెల‌ల త‌ర్వాత ఇస్తే 90 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుంద‌ని అన్నారు ఈ వ్యాక్సిన్‌ను త‌యారు చేస్తున్న సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలా. నెల రోజుల లోపు ఇస్తే 60 నుంచి 70 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న ఈ టీకా.. రెండు నుంచి మూడు నెల‌ల మ‌ధ్య ఇస్తే 90 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు తేలింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ క‌లిసి అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో సీర‌మ్ త‌యారు చేస్తున్న విషయం తెలిసిందే.

లాన్సెట్‌లోనూ ఇదే విష‌యాన్ని చెబుతూ ఓ అధ్య‌యనం ప్ర‌చురిత‌మైంది. కొవిషీల్డ్ అనే కాదు ఇత‌ర వ్యాక్సిన్ల విష‌యంలోనూ రెండు డోసుల‌కు మ‌ధ్య ఎక్కువ విరామం ఇస్తే అవి స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు తేలింద‌ని పూనావాలా చెప్పారు. గ‌త నెల‌లోనే ప్ర‌భుత్వం కొవిషీల్డ్ డోసుల మ‌ధ్య విరామాన్ని గ‌రిష్ఠంగా 8 వారాల వ‌ర‌కూ పెంచిన విష‌యం తెలిసిందే. క‌నీసం ఆరు వారాల ఇస్తే ఈ వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌త పెరిగిన‌ట్లు వివిధ దేశాల్లో చేసిన అధ్య‌య‌నంలో తేల‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. తొలి డోసు తీసుకున్న నెల రోజుల త‌ర్వాత ఇమ్యూనిటీ పెరుగుతున్న‌ట్లు అద‌ర్ పూనావాలా కూడా చెప్పారు.

ముఖ్యంగా 50 ఏళ్ల లోపు వాళ్ల‌లో ఒక్క డోసుతోనే అద్భుత‌మైన ఫ‌లితాన్ని చూశాము. ఒక్క డోసుతోనే నెల రోజుల త‌ర్వాత కరోనా నుంచి మంచి ర‌క్షణ ల‌భించింది. కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ కంటే కూడా ఎక్కువ ఇమ్యూనిటీ వీళ్ల‌లో క‌నిపించింది. ఒక్క డోసుతోనే క‌నీసం 70 శాతం మందికి కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ దొరుకుతుంది. అయితే దీర్ఘ‌కాలంలో కొవిడ్ నుంచి ర‌క్ష‌ణ కోసం రెండో డోసు త‌ప్ప‌నిస‌రి అని అద‌ర్ పూనావాలా స్ప‌ష్టం చేశారు. రెండో డోసు త‌ర్వాత కూడా మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. హెర్డ్ ఇమ్యూనిటీ వ‌చ్చే వ‌ర‌కూ లేదంటే ఏదైనా చికిత్స అందుబాటులోకి వ‌చ్చే వ‌ర‌కూ ఇది త‌ప్ప‌ద‌ని పూనావాలా అన్నారు. దీనికి కొన్నేళ్లు ప‌ట్టొచ్చ‌ని చెప్పారు.