హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి రెండవ తేదీ నుంచి వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ టీకాలను పంపిణీ చేసేందుకు ఈ డ్రైన్ ఏర్పాటు చేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ డ్రై రన్ నిర్వహించనున్నారు. త్వరలోనే కోవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇవాళ ప్రధాని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రై రన్ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కోవిడ్ టీకాకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపే ఛాన్సు కూడా ఉన్నది. దేశంలో వ్యాక్సినేషన్ కోసం డ్రై రన్‌ను ఏర్పాటు చేయడం ఇది రెండవ సారి అవుతుంది. ఈనెల 28, 29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.
వ్యాక్సిన్ రోలౌట్..
వ్యాక్సినేషన్ లక్ష్యాలను అందుకునేందుకు అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని తన ఆదేశాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. టీకా పంపిణీ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అయ్యారు. జనవరి రెండవ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు డ్రైన్ రన్ నిర్వహిస్తాయని, ఆయా రాష్ట్రాల రాజధానుల్లో కనీసం మూడు ప్రాంతాల్లో ఈ డ్రైన్ నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొన్నది. కొన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లోనూ టీకా పంపిణీ చేయనున్నారు.