కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పటికే భారీ ఊరటనిచ్చిన వ్యాక్సిన్ తయారీదారులు మరో శుభవార్త అందించారు. అన్ని సవ్యంగా జరిగితే మరి కొన్నిరోజుల్లోనే కోవిడ్-19 డెలివరీ షురూ కానుంది. ఈ మేరకు బయోఎన్‌టెక్ సీఈవ్ ఉగుర్ సాహిన్ రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుధవారం ప్రకటించారు. ఈ ఏడాది క్రిస్మస్ కంటే ముందే ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ డెలివరీ మొదలు పెట్టనున్నామని భావిస్తున్నామన్నారు.
తమ కరోనా టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అమెరికా కంపెనీ ఫైజర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగుర్ సాహిన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూరోప్‌లో ఈ వ్యాక్సిన్‌కు డిసెంబరులో టీకా అత్యవసర వినియోగం ఆమోదం, డిసెంబర్ రెండవ భాగంలో షరతులతో కూడిన అనుమతి లభించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అన్నీ సానుకూలంగా జరిగితేనే డిసెంబర్ మధ్యలో టీకాకు అనుమతి లభిస్తుందని, క్రిస్మస్ పండుగ లోపే డెలివరీలు ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నామన్నారు.
జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన తమ రెండు డోసుల టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని ప్రాథమిక ప్రమాణాల్లో విజయం సాధించిందని ప్రకటించేందుకు గర్వంగా ఉందని ఫైజర్ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన పెద్దలలో కూడా తమ టీకా సామర్థ్యం 94శాతం కంటే ఎక్కువేననని తుది ప్రయోగ ఫలితాల్లో తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల, భిన్న వయస్కులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశామని తెలిపింది. ఫైజర్ టీకాను మైనస్ 70డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుందని పేర్కొంది. త్వరలో అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేస్తామని వెల్లడించింది.