దేశంలో మరోసారి కరోనా పంజా

దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసులు భారీగా తగ్గిపోగా.. తాజాగా వాటి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్‌ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధేంచేందుకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేంద్రం ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండగా.. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఢిల్లీ, హర్యానా రాష్ట్రల్లో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ మాట్లాడుతూ.. ‘‘మహారాష్ట్ర పరిస్థితి చూస్తే.. మాకు ఆందోళనగా ఉంది. ఇది చాలా సీరియస్‌ అంశం’’ అన్నారు

‘‘మహారాష్ట్ర.. దేశ ప్రజలకు రెండు పాఠాలు నేర్పుతోంది. వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు. జాగ్రత్తలు పాటించడం మరవకూడదు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 1,89,226 యాక్టీవ్‌ కేసులు ఉండగా.. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా కేసులున్నాయి. అలానే యాక్టీవ్‌ కేసుల్లో టాప్‌ 10లో బెంగళూరు అర్బన్‌, పుణె, అమరావతి, జల్‌గావ్‌, నాసిక్‌, ఎర్నాకులం, ఔరంగబాద్‌, నాగ్‌పూర్‌, థానె, ముంబై ఉన్నాయి. ఈ జిల్లాలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అన్నారు.దేశంలో కరోనా మరణాల రేటు తగ్గుతోందని.. రికవరీల రేటు పెరుగతోందన్నారు రాజేష్‌ భూషణ్‌. ఇప్పటివరకు 2.56 కోట్ల మందికి పైగా టీకా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల వాటా 71 శాతం కాగా ప్రైవేటు ఆస్పత్రుల వాటా 28.77 శాతంగా ఉందన్నారు.