వైల్డ్‌ డాగ్‌ సినిమా విడుదల తేదీ

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ప్రసారమవుతున్న సమయంలో వైల్డ్‌ డాగ్‌ షూటింగ్‌ కోసం కులుమనాలీ వెళ్లాడు హీరో నాగార్జున. ఓవైపు షూటింగ్‌ చేస్తూనే మరోవైపు షో హోస్టింగ్‌ చేపట్టాడు. రెండింటినీ సమంగా బ్యాలెన్స్‌ చేసిన హీరో తాజాగా తన సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు. ఏప్రిల్‌ 2న వైల్డ్‌ డాగ్‌ విడుదల చేస్తున్నామని వెల్లడించాడు.

గత కొంత కాలంగా ఇది ఓటీటీలో రిలీజ్‌ అవుతుందన్న పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన నాగ్‌ ఇది ఓటీటీ సినిమా కాదని, ఎక్స్‌క్లూజివ్‌గా థియేటర్లలో రిలీజవబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాతో అహిషోర్‌ సల్మాన్‌ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇక ఇందులో నాగ్‌ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెంట్‌) ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా కనిపించనున్నాడు.

పుణె, కులుమనాలీ, ముంబై సహా పలు ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో దియా మీర్జా, సైయామీ ఖేర్‌, అటుల్‌ కులకర్ణి, అలీ రెజా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

శ్యానీల్‌ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మరోవైపు నాగ్‌.. బాలీవుడ్‌ ప్రేమ జంట రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ తొలిసారి జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్రలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘గరుడవేగ’ ఫేమ్‌ ప్రవీణ్ సత్తారుతో మరో సినిమా చేస్తున్నాడు.