మెగా వారింట పెళ్లి బాజాలు

మెగా వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక వివాహానికి వారం ముందుగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన మెగా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మెగా కాపౌండ్ హీరోలతో పాటు, మెగా వారసులంతా నాగబాబు ఇంటికి చేరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యమ యాక్టివ్‌గా ఉంది కొత్త పెళ్లి కూతురు నిహారిక. ఈ మేరకు తాజాగా తనను పెళ్లి కూతురుగా ముస్తాబు చేసిన ఫొటో, ప్రస్తుతం ఇంట్లో ఉన్న సందడి వాతావరణాన్ని పోస్ట్ చేసింది మెగా డాటర్.

గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు చైతన్యతో డిసెంబ‌ర్ 9వ తేదీన రాజ‌స్తాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో నిహారిక పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి వేడుక‌కు మెగా ఫ్యామిలీ అంతా హాజరు కానున్నారు. కాగా ఈ రోజు (శనివారం) నాగబాబు స్వగృహంలో నిహారికను పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు.

ఇంటిని పూలతో ఎంతో అందంగా ముస్తాబు చేసి నిహారికకు మంగళ స్నానం చేయించి పట్టు వస్త్రాలతో పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఈ ఫోటోలను నిహారిక తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. డిసెంబర్ 9న జరగనున్న నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల సందడి కనిపించనుంది. ఆ తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులందరి కోసం హైదరాబాద్‌లో స్పెషల్ పార్టీ అరేంజ్ చేయనుంది మెగా ఫ్యామిలీ.