తీవ్రంగా మండిపడ్డ యంగ్‌ హీరో

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌పై తన ప్రతాపాన్ని చూపించాడు. ఇబ్బందికరమైన హెడ్డింగ్‌తో యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్టు చేసినందుకు సంబంధిత ఛానల్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. ఇలాంటి వీడియోలు పోస్టు చేసే ముందు మన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారన్న విషయం గుర్తుంచుకొని కొంచెం ఇంగితజ్ఞానంతో వ్యవహరించాలని ఫైర్‌ అయ్యాడు.

ఆ వీడియో పెట్టిన వ్యక్తి 24 గంటల్లో క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్టు చేయాలని, లేకుంటే తన ఇంటికి వచ్చి మరీ వీడియో పెట్టిస్తానని గట్టిగా హెచ్చరించాడు. అయితే విశ్వక్‌ సేన్‌ ఇంతలా అగ్రెసివ్‌ అవ్వడానికి బలమైన కారణమే ఉంది. అదేంటంటే..

నందితశ్వేత హీరోయిన్‌గా నటిస్తున్న ‘అక్షర’ చిత్రంలోని ఓ పాట విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. దీనికి విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా.. విశ్వక్‌ గురించి హీరోయిన్‌ నందిత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విశ్వక్‌సేన్‌ రావడం సంతోషంగా ఉందని.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే.. ఆ వీడియోను ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో అర్థం మార్చి ఇబ్బందికరమైన టైటిల్‌‌తో పోస్టు చేశాడు. ‘విశ్వక్‌.. నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు ఇచ్చేస్తా’ అనే థంబ్‌నైల్‌ పెట్టగా.. ఇది కాస్తా విశ్వక్‌సేన్‌ దృష్టికి వెళ్లింది. ఇంకేముంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో ఓ వీడియో పెడుతూ.. సదరు యూట్యూబ్‌ ఛానల్‌ను ఏకిపారేశాడు.

‘ఇప్పుడే థంబ్‌నైల్‌ చూశా. అంటే మీకు మన ఇంట్లో ఆడవాళ్లు ఉండారని కొంచెం కూడా అనిపించడం లేదా.. వాళ్ల గురించి కూడా ఇలానే మాట్లాడదాం అనే ఇంటెన్షన్ ఉంటేనే నువ్వు ఇలా రాస్తావ్.. ఆ అమ్మాయి మాట్లాడింది ఏంటి.. మీరు రాసింది ఏంటి. మీరు రాసింది ఎంత గలీజ్‌గా ఉంది తెలుసా.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్న కానీ.. అది రాసినవాడు ఎవడో కానీ ఎంత సిగ్గులేని బతుకు వాడిది.

ఆ ఛానల్‌ పేరు అక్కడే రాసి ఉంది. 24 గంటల్లో సారీ(sorry) చెబుతూ ఇంకో వీడియో పెట్టకుంటే.. ఎక్కడున్నా నీ ఇంటికొచ్చి మరీ నీతో వీడియో పెట్టిస్తా. నాకు షూటింగ్‌ ఉన్నా పర్వాలేదు’.. అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. మరోవైపు యూట్యూబ్‌లో ఇలాంటివి ఇలాంటివి సర్వసాధారణంగా మారిపోయిందని నెటిజన్లు విశ్వక్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.