తప్పుకున్న విజయ్‌ సేతుపతి

అన్నీ అనుకున్నట్లే జరిగితే తమిళ నటుడు విజయ్‌ సేతుపతి హిందీ తెరకు కూడా పరిచయం అయ్యేవారు. కానీ తేదీలు తారమారు కావడంతో ప్లాన్‌ తారుమారైంది. అసలు విషయంలోకి వస్తే.. ఆమిర్‌ ఖాన్‌ నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో విజయ్‌ సేతుపతిని ఓ పాత్రకు తీసుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ వంటి లెక్కలు వేయకుండా క్యారెక్టర్‌ నచ్చితే చేస్తారు సేతుపతి. ‘లాల్‌..’లో పాత్ర బాగా నచ్చి, ఒప్పుకున్నారు.

కానీ కరోనా వల్ల షూటింగులకు బ్రేక్‌ పడటంతో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకుంటున్నారని టాక్‌. ఈ ఏడాది అక్టోబర్‌లో సేతుపతి ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనాల్సింది. అయితే అప్పటికి షూటింగ్‌ ఆరంభం కాకపోవడంతో ఇప్పుడు డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోయారట. ఆమిర్, చిత్రదర్శకుడు అద్వైత్‌ చందన్, సేతుపతి కూర్చుని మాట్లాడుకుని, ఒక సానుకూల వాతావరణంలో చర్చించుకున్నారట. భవిష్యత్తులో వేరే ప్రాజెక్ట్‌కి కలసి పని చేద్దాం అని కూడా మాట్లాడుకున్నారని బాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం సేతుపతి చేతిలో అరడజను సినిమాల వరకూ ఉన్నాయి.