ఫిదా అయిన విజయ్‌ దేవరకొండ

నటీనటులపై తమకున్న ఇష్టాన్ని పలు విధాలుగా చాటుకుంటారు అభిమానులు‌. కొంతమంది భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తే.. మరికొంత పాలాభిషేకాలు, వారి పుట్టినరోజున రక్తదానాలు వంటి సేవా కార్యక్రమాలు చేపడతారు. ఇక మరికొంత మందైతే ఏకంగా గుడి కట్టి మరీ పూజలు కూడా చేస్తారు. తమిళనాడులో ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్‌ విషయానికొస్తే అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులను రౌడీ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ యువహీరోకు అమ్మాయిల్లో కూడా ఇమేజ్‌ ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ లేడీ ఫ్యాన్‌ విజయ్‌పై తనకున్నఅభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగురాలు స్వప్నికా.. నోటితోనే కుంచెపట్టి అతడి చిత్రాన్ని గీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇక స్వప్నికలో దాగున్న కళకు ఫిదా అయిన విజయ్‌ దేవరకొండ.. ‘‘లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ స్వప్నికా.. నువ్వు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో రౌడీస్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా ప్రస్తుతం విజయ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ భామ అనన్య పాండే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.