మేకోవర్‌ అవుతున్న వైష్ణవ్‌ తేజ్‌

హీరో వైష్ణవ్‌ తేజ్‌ హాకీ స్టిక్‌ పట్టుకుని బరిలో దిగనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్‌ అవుతున్నారట. ఇదంతా వైష్ణవ్‌ హీరోగా నటించనున్న తర్వాతి చిత్రం కోసమే అనే సంగతి అర్థమై ఉంటుంది. తొలి సినిమా ‘ఉప్పెన’తో ఘన విజయం అందుకున్న వైష్ణవ్‌ తేజ్‌ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మాతగా ఓ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్‌పై హీరో నాగార్జున నిర్మాతగా మరో సినిమా చేయనున్నారాయన. నాగార్జున నిర్మించే చిత్రం క్రీడల నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. పృథ్వీ అనే కొత్త డైరెక్టర్‌ తెరకెక్కించనున్న ఈ సినిమా హాకీ నేపథ్యంలో రూపొందనుందట. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌ హాకీ ప్లేయర్‌ పాత్ర చేయనున్నారని టాక్‌. అసలు సిసలైన హాకీ ప్లేయర్‌గా ఒదిగిపోవడానికి వైష్ణవ్‌ కసరత్తులు మొదలుపెట్టారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వార్త.