దేశంలో పోతోందనుకుంటున్న కరోనా మహమ్మారి మరో రూపంలో దూసుకొస్తోంది. దీంతో కరోనా స్ట్రెయిన్ పేరుతో వస్తున్న కొత్త కరోనా ఇప్పుడిప్పుడే మన దేశంలో వ్యాపిస్తోంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా టాలీవుడ్‌ను కరోనా టెన్షన్ పెడుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఇద్దరు హీరోలు రామ్‌చరణ్, వరుణ్‌తేజ్ నిన్న కొద్ది సమయం తేడాతో కరోనా బారిన పడడం ఆంందోళన కలిగిస్తోంది.రామ్‌చరణ్, వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ కోడలు , రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. తన భర్త చరణ్‌కు పాజిటివ్ వచ్చిన తర్వాత తాను కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని.. నెగెటివ్ వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. కానీ, తనకు మళ్లీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.తాను కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని, వేడి నీరు, ఆవిరి పట్టుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా నుంచి ఎలా రక్షణ పొందాలో గతంలో ఉపాసన జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినీ కళాకారులకు సాయం అందించే క్రమంలో, ఉపాసన అండగా నిలబడడం ప్రశంసలు అందుకుంది.
