2021 సినీ జాతర.. ప్రతి నెల ఓ క్రేజీ మూవీ

లాక్ డౌన్ కారణంగా గతేడాది సినిమాలు లేని లోటు ఈ ఏడాది తీరబోతోంది. చిరంజీవి, పవన్, ప్రభాస్, చరణ్, తారక్ లాంటి బడా హీరోలతో పాటు దాదాపు హీరోలంతా ఈ ఏడాది బాక్సాఫీస్ ను టచ్ చేయబోతున్నారు. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీ అవకాశాలు కనిపిస్తుండడంతో అంతా చకచకా తమ సినిమాల్ని పూర్తిచేయడంతో పాటు, అంతే వేగంగా రిలీజ్ డేట్స్ కూడా ప్రకటిస్తున్నారు.

తాజాగా ఎనౌన్స్ చేసిన విడుదల తేదీల ప్రకారం చూసుకుంటే.. ఈ ఏడాది ప్రతి నెలా ఓ క్రేజీ మూవీ ప్రేక్షకుల కోసం సిద్ధమౌతోందనే చెప్పాలి. ఇప్పటికే జనవరిలో క్రాక్, రెడ్ లాంటి సినిమాలు థియేటర్లలోకి రాగా.. ఫిబ్రవరి నుంచి నెలకో సినిమా థియేటర్లలో కనువిందు చేయబోతోంది.

ఫిబ్రవరి నెలలో.. ఉప్పెన (12వ తేదీ), చెక్ (19వ తేదీ), ఏ1 ఎక్స్ ప్రెస్ (26), జాంబీరెడ్డి (5), కపటధారి (26) లాంటి సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. వీటిలో ఉప్పెన, చెక్ సినిమాలపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. కొత్త హీరో అయినప్పటికీ పాటలతో ఉప్పెన ఆకర్షిస్తోంది. ఇక చెక్ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీ పాత్రలో కనిపించడం, చదరంగం లాంటి డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టోరీ కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఇక తెలుగులో మొట్టమొదటి హాకీ బేస్డ్ మూవీగా వస్తోంది ఏ1 ఎక్స్ ప్రెస్.

మార్చి నెలలో.. శ్రీకారం (11వ తేదీ), గాలిసంపత్ (11), రంగ్ దే(26), అరణ్య(26), జాతిరత్నాలు(11), మోసగాళ్లు(11) లాంటి సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటిలో రంగ్ దే, అరణ్య సినిమాలపై అంచనాలున్నాయి. నితిన్-కీర్తిసురేష్ నటిస్తున్న క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఇక పాన్ ఇండియా మూవీగా రానా  నటించిన అరణ్య సినిమా కూడా ఇదే నెలలో థియేటర్లలోకి వస్తోంది.

ఇక ఏప్రిల్ నెలలో.. సీటీమార్, వకీల్ సాబ్, లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం సినిమాలున్నాయి. పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ను ఏప్రిల్ 9న రిలీజ్ చేయబోతున్నారు. ఇక లవ్ స్టోరీ, టక్ జగదీశ్ సినిమాలు రెండూ ఏప్రిల్ 16కు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటిలో లవ్ స్టోరీ రావడం పక్కా. టక్ జగదీశ్ రిలీజ్  మాత్రం వాయిదా పడే ఛాన్స్ ఉంది. గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ ఏప్రిల్ 2, రానా-సాయిపల్లవి విరాటపర్వం ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానున్నాయి.

మే నెలలో.. చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 7న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఇక బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న (ఇంకా పేరుపెట్టని) సినిమా కూడా ఇదే నెలలో రిలీజయ్యేలా ఉంది. వీటితోపాటు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, సాయితేజ్ రిపబ్లిక్ మూవీస్ కూడా ఇదే నెలలో రాబోతున్నాయి.

జూన్ రిలీజ్ అంటూ ప్రస్తుతానికి ఏ సినిమా డేట్స్ ప్రకటించనప్పటికీ.. అన్-షెడ్యూల్ లో నారప్ప, చావుకబురు చల్లగా, 18-పేజెస్, ఖిలాడీ లాంటి సినిమాలున్నాయి. వీటిలో ఏదో ఒక సినిమా ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామ్స్ సీజన్ అయినప్పటికీ.. ఇతర నెలల్లో ఉన్న ఒత్తిడి కారణంగా జూన్ లో కూడా ఓ మోస్తరు అంచనాలున్న సినిమాలు థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక జులైలో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తున్న ఈ సినిమాను జులై 30కు షెడ్యూల్ చేశారు. ఇదే నెలలో బ్లాక్ బస్టర్ హిట్ కేజీఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ చాప్టర్-2 కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు నాగశౌర్య నటిస్తున్న వరుడు కావలెను సినిమాను కూడా ఇదే నెలలో తీసుకురావాలనుకుంటున్నారు.

ఆగస్ట్ నెలలో 2 క్రేజీ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఒకటి అల్లు అర్జున నటిస్తున్న పుష్ప. ఈ సినిమాను ఆగస్ట్ 13కు షెడ్యూల్ చేశారు. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్3 సినిమా కూడా ఇదే నెలలో.. 27న థియేటర్లలోకి రాబోతోంది. నిజానికి ఆగస్ట్ నెలలో పుష్ప, సర్కారువారి పాట సినిమాలు పోటీపడాలి. కానీ సర్కారువారి పాట షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఆగస్ట్ కు వచ్చేలా కనిపించడం లేదు. కుదిరితే ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అది మిస్ అయితే అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ ఉంటుంది.

ఇక సెప్టెంబర్ లో పవన్-రానా కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

అలాగే అక్టోబర్ లో మోస్ట్ ఎవెయిటింగ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ (13వ తేదీ) ను తీసుకురాబోతున్నారు.

నవంబర్-డిసెంబర్ నెలలకు కూడా సినిమాలు ఇప్పట్నుంచే రెడీ అయిపోతున్నాయి. సాయితేజ్-కార్తీక్ దండు కాంబినేషన్ లో రాబోతున్న థ్రిల్లర్ మూవీ, పవన్-క్రిష్ కొత్త సినిమా, నితిన్ అంధాధూన్ రీమేక్, నాగచైతన్య థ్యాంక్ యు, నాని నటిస్తున్న అంటే సుందరానికి లాంటి సినిమాలు ఈ 2 నెలల్లో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇలా ఈ ఏడాది ప్రతి నెల ఓ క్రేజీ మూవీ థియేటర్లలోకి రావడంతో పాటు.. ఆల్ మోస్ట్ స్టార్ హీరోలంతా ఈ ఏడాది సందడి చేయబోతున్నారు.