మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన టిక్‌టాక్‌ స్టార్

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి రచ్చరచ్చ చేశాడు. డ్రంకెన్ డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్నపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని షణ్ముఖ్‌ని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న షణ్ముఖ్.. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అపార్ట్‌మెంట్‌ లోపలికి రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. షణ్ముఖ్ టిక్‌టాక్ సిరీస్‌లోని డైలాగ్ ‘అరే ఏంట్రా ఇదీ’ అంటూ దిమ్మతిరిగేలా కామెంట్స పెడుతున్నారు.