రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనను విరమించుకున్నట్టుగా ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా షూటింగ్ కూడా కాస్త వాయిదానే పడింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం.. రజనీకాంత్ వరసగా 45 రోజుల షూటింగ్ తో అన్నత్తే సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అవుతారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనే లేదని రజనీ తేల్చారు.తమిళనాడు ఎన్నికలకు మరెంతో సమయం లేదు కాబట్టి.. ఈ సమయంలో రజనీ చేసిన ప్రకటన ప్రకారం, ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ లేనట్టే అనుకోవాలి. ఒకవేళ రజనీ మళ్లీ మనసు మార్చుకుని, అభిమానుల కోరుతున్నారంటూ రాజకీయాల్లోకి వచ్చినా.. జనాలు సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉండవు. ఈ నేపథ్యంలో ఇక రజనీ కాంత్ రాజకీయ ఎంట్రీ దాదాపు లేనట్టే.ఆ సంగతలా ఉంటే.. ప్రస్తుతం షూటింగ్ కు కూడా హాజరు కావడం లేదట రజనీకాంత్. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. కొన్నాళ్ల పాటు రిలాక్స్ కానున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో రజనీ కాంత్ షూటింగుకు హాజరు కారట, బహుశా ఫిబ్రవరి నుంచి మళ్లీ రజనీకాంత్ సెట్స్ మీదకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.దీంతో అన్నత్తే సినిమా మరి కొన్నాళ్లు వాయిదా పడినట్టే. ఈ సినిమా షూటింగ్ కోసమని యూనిట్ అంతా హైదరాబాద్ లో మకాం పెట్టింది. హీరోనే షూటింగుకు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమా కొన్నాళ్లు వాయిదా పడినట్టేనేమో. ఇక రజనీకాంత్ రాజకీయ ఆలోచనలను విరమించుకోవడం తమిళ మూవీ మేకర్లకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే. ఆయనతో సినిమాలు చేయాలని కలలు కనే మూవీ మేకర్లకు రజనీకాంత్ సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. ఇక వరసగా రజనీకాంత్ మరిన్ని సినిమాలు చేసే అవకాశాలున్నట్టే.
