వాటిలో వాస్తవం లేదని చెప్పిన సురేఖ వాణి

సింగర్‌ సునీత రెండో పెళ్లి అనంతరం నటి సురేఖ వాణి పెళ్లిపై గాలి మళ్లింది. సునీత బాటలోనే సురేఖ కూడా త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు ప్రచురితమయ్యాయి. సురేఖ రెండో వివాహానికి సిద్ధమైందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సునీత పెళ్లికి తన పిల్లలిద్దరూ ఎంకరేజ్‌ చేయడంతో ప్రస్తుతం సురేఖ కూతురు సుప్రీత కూడా తల్లిని మళ్లీ పెళ్లి చేసుకోవాలని సూచించినట్లు టాక్‌. దీంతో సురేఖ పెళ్లి విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజాగా ఈ విషయంపై సురేఖ వాణి స్పందించారు. తను రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలను ఖండించారు. అవి కేవలం పుకార్లేనని, వాటిలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన కూతురితో సంతోషంగా ఉన్నానని, సుప్రీత నుంచి పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి ఏం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సురేఖ భర్త చనిపోయి కేవలం ఏడాది పూర్తయ్యింది. ఆమె భర్త సురేష్‌ తేజ 2019 మేలో అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. సురేష్ తేజ హాస్పిటల్ లో ఉన్న చివరి దశలో సురేఖ భర్త దగ్గరే ఉన్నారు.

ఇక ప్రస్తుతం సురేఖ తన కూతురిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీత సోషల్ మీడియాలో రోజుకో ఫోటో పోస్ట్ పెడుతూ అదరగొడుతూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అంతేగాక సుప్రీత నటన, డ్యాన్సు, డైలాగుల కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక కూతురు భవిష్యత్తులో సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. తాను మాత్రం అడ్డు చెప్పానని.. అది తన కూతురి ఇష్టమని సురేఖ వాణి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.