ఒక వ్యక్తి పరువు ప్రతిష్టను ఎలా నాశనం చేస్తారు

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సురేఖా వాణి. గత కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు గానీ, సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగానే ఉంటున్నారు. తన ముద్దుల కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ, ఆ ఫొటోలు షేర్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. గ్లామర్‌లో హీరోయిన్ల కంటే కూడా తక్కువేమీ కాదంటూ కితాబులు అందుకుంటున్నారు. ఇలా పైకి సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా భర్త అకాల మరణం తాలూకు విషాధ ఛాయలు సురేఖా వాణిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయట. 2019లో ఆమె జీవిత భాగస్వామి మరణించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి కూతురే లోకంగా బతుకుతున్నారు సురేఖా వాణి. ఈ క్రమంలో కూతురి సలహాతో ఆమె రెండో పెళ్లికి సిద్ధమయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. సింగర్‌ సునీత- రామ్‌ వీరపనేని రెండో వివాహం నేపథ్యంలో సుప్రీత కూడా తల్లిని అదే బాటలో నడవాల్సిందిగా సూచించారంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేశారు. వీటిని సురేఖా వాణి ఖండించారు కూడా.

వదంతులు వ్యాప్తి చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా సురేఖా వాణి కూతురు సుప్రీత ఇన్‌స్టా స్టోరీ చర్చకు దారితీసింది. ‘‘ఉన్న న్యూస్‌ చెప్పండి. కొత్తగా క్రియేట్‌ చేయకండి. కనీసం మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అని చెప్పుకోకండి. ఆదాయం కోసం ఒక వ్యక్తి పరువు, ప్రతిష్టను ఎలా నాశనం చేస్తారు’’ అంటూ ఇన్‌స్టా వేదికగా ఫైర్‌ అయ్యారు సుప్రీత. దీంతో తల్లి గురించి వస్తున్న వార్తలపైనే ఆమె ఈ మేరకు ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.