కేటీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సుమ

కొన్ని దశాబ్దాలుగా తన మాటలతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతూ అలరిస్తున్నారు సుమ కనకాల. యాంకరింగ్‌లో కొత్తదనాన్ని తీసుకొచ్చి నేడు స్టార్‌ యాంకర్‌గా నిలదొక్కుకున్నారు. సినిమాలు, షోలు, ఆడియో రిలీజ్‌లు ఇలా ఒక్కటేంటి అన్నిరంగాల్లోనూ తనదైన ముద్రను వేసిన సుమ ఇటీవల సుమక్క పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా ప్రారంభించారు. ఇక్కడ కూడా తన వాక్చాతుర్యంతో కొన్ని లక్షల మంది హృదయాలను దోచుకున్నారు. ఎప్పుడూ తన షోకు అతిథిగా వచ్చిన వారితో ఎంటర్‌టైన్‌ చేసే సుమ తాజాగా తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.

ఈ మేరకు ట్విటర్‌లో కేటీఆర్‌తో సంభాషిస్తున్న ఫోటోను షేర్‌చేశారు. ‘మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నా షోలలో నాన్‌స్టాప్‌గా ఎదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాను. కానీ నాయకత్వ హోదాలో మీరు మాట్లాడే విధానం వినడానికి ఎంతో విలువైనదిగా ఉంటుంది. నిబద్దత, మాట్లాడే విధానం అద్భుతం’ అంటూ కేటీఆర్‌ను పొగడ్తాలతో ముంచెత్తారు. ఇదిలా ఉండగా నెటిజన్లు మాత్రం సుమ ట్వీట్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు. సుమను కలవడం కేటీఆర్‌ లక్కీ అని కొంత మంది అభిప్రాయపడుతుంటే త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరపున క్యాంపెయినింగ్‌ చేయనున్నారా అని అడుగుతున్నారు. మరికొంత మంది ఎన్నికల ప్రచారం కోసం కలిశారా అని కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు.