హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ఉన్న సింగర్

స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమె సొంతం. సునీత గానం ఎంత మధురంగా ఉంటుందో.. రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఆమె అందానికి ముగ్ధులు కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే అందగత్తె అయిన ఈ సింగర్‌కి హీరోయిన్‌గా కూడా బోలెడన్నీ అవకాశాలు వచ్చాయట. చాలా మంది దర్శక నిర్మాతలు హీరోయిన్‌గా చేయమని అడిగారట. కానీ ఆమె మాత్రం ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించారట. సింగ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పుడే, హీరోయిన్‌గా కూడా అవ‌కాశాలు వచ్చాయట. కానీ ఆమె నటించడానికి భయపడ్డారట. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సునీతకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. కానీ హీరోయిన్ గా మారితే కష్టాలు ఉంటాయని, వాటిని దగ్గర నుంచి చూశానని.. అలాంటి జీవితం తనకు వద్దు అంటూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని కూడా సున్నితంగా తిరస్కరించారట సునీత.

అలాగే రామ్‌ గోపాల్‌ వర్మ ‘అనగనగా ఒక రోజు’సినిమాలో కూడా హీరోయిన్‌గా అవకాశం ఇస్తే కూడా నో చెప్పారట. ఈ విషయాలన్నీ ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది సునీత. మరి ఇప్పుడు అవకాశం వస్తే చేస్తారా ? అనే ప్ర‌శ్న‌కు సునీత ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా మార్చడం ఎందుకని.. ఇప్పుడంతా బాగానే ఉంది క‌దా అని సమాధానం ఇచ్చింది. సునీత చెబుతున్న ప్ర‌కారం హీరోయిన్ కావ‌డం అంటే ప్ర‌శాంత‌త‌ను కోల్పోవ‌డ‌మే అన్న మాట అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు