బీజేపీ నేతపై విరుచుకుపడ్డ సిద్దార్థ్‌

ఈ మధ్య హీరో సిద్దార్థ్‌కు అధికార పార్టీ బీజేపీతో అసలు పడటం లేదు. కొంతకాలం నుంచి బీజేపీని విమర్శస్తూ సిద్దూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా, బయట జరిగిన సంఘటనలను అనుసంధానిస్తూ బీజేపీని విమర్శిస్తూ వస్తున్నాడు. ఇక వాటిని బీజేపీ ఖండించినప్పటికి సిద్దూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండ రివర్స్‌ అటాక్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని, అది బీజేపీ పనే అని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రోజురోజుకు ఈ వివాదం ముదురుతూనే ఉంది. ఈ తరుణంలో నిన్న తమిళనాడు బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య‌ను కసబ్‌తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సిద్దూ.

ఇదిలా ఉండగా తాజాగా మరో బీజేపీ నేతపై సిద్దార్థ్‌ విరుచుకుపడ్డాడు. ఏపీ బీజేపీ స్టేట్‌ సెక్రటరీ విష్ణువర్థన్‌ రెడ్డి చేసిన ట్వీట్‌పై అతడు నిప్పులు చేరిగాడు. ‘మీరు నటించిన సినిమాలకు దావూద్‌ ఇబ్రహీం ఫండ్స్‌ ఇస్తాడట కదా.. ఇది నిజమేనా సమాధానం చెప్పండి సిద్దార్థ్‌’ అంటూ ఆయన ప్రశ్నించాడు. దీంతో సిద్దూ స్పందిస్తూ.. దావూద్ ఇబ్రహీం ఎప్పుడు తన టీడీఎస్ చెల్లించలేదన్నాడు. ఎందుకంటే తాను క్రమం తప్పకుండా టాక్స్ కడతానని, తనకు ఏ మాఫియాడాన్‌లు టాక్స్‌లు కట్టరంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా విష్ణువర్థన్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో సిద్దూ తీరుపై బీజేపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.