విడిపోయాకే హ్యాపీగా ఉంటున్నారు

కమల్‌ హాసన్‌ కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌ శృతీ హాసన్‌. కానీ తనదైన నటతో, ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. సింగర్‌, నటి, డ్యాన్సర్‌, సంగీత దర్శకురాలిగా.. ఇలా ఎన్నో కళల్లో ఆరితేరిన శృతీ ఏదైనా సూటిగా సుత్తి లేకుండా ముఖం మీదే చెప్పేస్తుంది. తాజాగా ఆమె తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి స్పందించింది.

శృతీ హాసన్‌ బాల్యంలోనే తల్లిదండ్రులు కమల్‌ హాసన్‌, సారిక విడిపోయారు. దీని గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వారు విడిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారికి ఇష్టం లేకపోయినా ఏవేవో కారణాలు చెప్పి బలవంతంగా కలిసుండేలా చేయడం కరెక్ట్‌ కాదు. వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. నా చిన్నవయసులోనే వారు ఒకరికొకరు దూరమయ్యారు. అదంతా చాలా ఈజీగా జరిగిపోయింది. అయినా కలిసి ఉన్నప్పటికంటే కూడా విడిపోయాకే వారు హ్యాపీగా ఉంటున్నారు’ అని చెప్పుకొచ్చింది. ఇక తను ఎక్కువగా తండ్రి కమల్‌కు క్లోజ్‌ అని చెప్పింది.

కమల్‌ సారికను ప్రేమించి 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 1986లో శృతీ హాసన్‌ జన్మించింది. 1991లో అక్షర పుట్టింది. అంతలోనే కమల్‌, సారిక మధ్య మనస్పర్థలు తొంగి చూశాయి. అవి కాస్తా పెద్దది కావడంతో 2004లో విడాకులు తీసుకున్నారు. ఇక అక్షర హాసన్‌ 2015లో ‘షమితాబ్‌’ సినిమాలో తళుక్కున మెరవగా శృతీ హాసన్‌ తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో రాణిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె ‘సలార్‌’లో జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది.