రణ్‌బీర్‌ కపూర్‌తో నటించాలని నా కోరిక

‘ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది సమంత. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌లో సమంత కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్‌సిరీస్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజీ అనే ప్రతినాయిక ఛాయలున్న పాత్రను సమంత పోషించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఇక ఫ్యామిలీమెన్‌ టీంతో కలిసి ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది సమంత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

బాలీవుడ్‌లో ఏ హీరో సరసన నటించాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా వెంటనే హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో నటించాలనుంది అని తన మనసులో మాటను బయటపెట్టేసింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే మూవీ రానుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ వెబ్‌సిరీస్‌లోమనోజ్‌ బాజ్‌పాయ్‌ పాత్ర దక్షిణాదిలో ఎవరికి సూట్‌ అవుతుందని అడగ్గా ‘మా మామ నాగార్జున’ అని బదులిచ్చింది. సమంత ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తుంది. దీనితో పాటు తమిళంలో ‘కాతు వాకులా రెండు కాదల్‌’ అనే సినిమాలో నటిస్తోంది.