దీంతో పోల్చుకుంటే యాక్టింగ్‌ చాలా సులభం

బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో దసరా ఎపిసోడ్‌లో తళుక్కున మెరిసిన సమంత అక్కినేని మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. తెలుగు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘ఆహా’ తన సబ్‌స్రైబర్లను పెంచుకునేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. విభిన్న షోలను ప్రవేశ పెడుతూ సబ్‌స్రైబర్లను ఆకర్షించే పనిలో పడింది. ఇందులో భాగంగా టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతతో ‘సామ్‌జామ్‌’ అనే కొత్త టాక్‌ షోను ప్రారంభించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సామ్‌ అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుండటంతో ఆమెతో ఈ టాక్‌ షో చేయించడం వల్ల తమ ప్లాట్‌ఫామ్‌కు మంచి మెంబర్‌షిప్‌ వస్తుందని ‘ఆహా’ భావిస్తోంది.

సామ్‌జామ్‌ షోలో సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో వినోదాన్ని పంచనున్నారు. నవంబబర్‌13న ఈ షో లాంఛనంగా ప్రారంభమవ్వగా.. మొదటి ఎపిసోడ్‌లో అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చారు. కాగా సామ్‌జామ్‌కు అక్కినేని వారి కోడలు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకుంటున్నట్లు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. కేవలం 10 ఎపిసోడ్‌లకు ఏకంగా 1.5 కోట్లు తీసుకోనుందని పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలిసి రావాలి. ఇదిలా ఉండగా ఈ షోకు త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతోపాటు మున్ముందు తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ పారుపల్లి, అల్లు అర్జున్‌ కూడా సమంత షోలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: చాలెంజ్‌గా తీసుకొని పని చేశాను

ఈ షో గురించి ఇటీవల సమంత మాట్లాడుతూ.. ‘‘సామ్‌జామ్‌ టాక్‌ షో కాదు. ఈ షోలో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తాం. ఈ షో నాకు చాలా పెద్ద చాలెంజ్‌. దీంతో పోల్చుకుంటే సినిమా యాక్టింగ్‌ చాలా సులభం అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ షో చేయటం ముఖ్యమనిపించింది. అందుకే చాలెంజ్‌గా తీసుకుని ఈ షో చేశాను’’ అన్నారు. మరోవైపు సమంత మొదటి సారి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌ ద్వారా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.