పవన్ కి నో చెప్పిన సాయి పల్లవి

‘కోలు కోలు..’, ‘సారంగదరియా..’ అంటూ రెండు వేర్వేరు సినిమాల్లోని పాటల్లో ఆడి అలరించింది సాయి పల్లవి. దీంతో యూట్యూబ్‌లో ఆమె ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’, రానాతో ‘విరాటపర్వం’, నానితో ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సినిమాలు చేస్తున్న ఆమె మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌లోనూ కనిపించనుందన్న వార్తలు వినిపించాయి. ఇందులో పవన్‌ కల్యాణ్‌తో జోడీ కడుతోందని ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ రూమర్లకు బ్రేక్‌ పడింది. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన నటించేందుకు సాయి పల్లవి నో చెప్పినట్లు సమాచారం.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె పవన్‌ సినిమాకు డేట్స్‌ కేటాయించడం కష్టమని ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. పైగా తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందని ఆమె భావించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ భారీ ప్రాజెక్ట్‌ నుంచి సాయిపల్లవి తప్పుకోవడం కొంత నిరాశ కలిగించే విషయం. ఇక ఆమె వైదొలగడంతో దర్శకనిర్మాతలు మరో హీరోయిన్‌ కోసం వెతుకులాట ప్రారంభించారంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ గత నెల 25న ఆరంభమైంది. ఇప్పటికే రానా, పవన్‌ మీద యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే– సంభాషణలు అందిస్తున్నారు. సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ళ.