బాలీవుడ్ సినిమాని తిరస్కరించిన సాయిపల్లవి

విభిన్నమైన పాత్రలు, డాన్స్‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ కుట్టి.. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళంలో కూడా నటిస్తూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. దీంతో తాజాగా నేచురల్‌ బ్యూటీకి బాలీవుడ్‌ ఆఫర్‌ కూడా వచ్చిందట. అయితే దాన్ని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి మూవీ హిందీలో రీమేక్స అవుతున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్‌ కాలేదు. ఇటీవల సాయిపల్లవిని కూడా సంప్రదిం‍చారట చిత్రబృందం. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది.

సాయి పల్లవి ప్రస్తుతం రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ‘విరాటపర్వం’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల నాగ చైతన్యల లవ్ స్టోరీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్‌లో కూడా సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుంది. ఇలా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సాయి పల్లవి ఫుల్‌ బిజీలో ఉంది. అందుకే బాలీవుడ్‌ ఆఫర్‌ని రిజెక్టు చేసిందట సాయిపల్లవి.