సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. కరోనా లేకపోయి ఉండి ఉంటే ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా వలన 8 నెలలు షూటింగ్స్ అన్నీ స్తంభించడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. అత్యంత పరాక్రమశాలి భీం, ఉగ్రరూపుడైన రామరాజు తమ ఉమ్మడి లక్ష్య సాధనకు సంసిద్ధులవుతున్నట్టుగా ఇటీవల ప్రకటించారు మేకర్స్.స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని మేళవించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ చెప్పేశారు. అక్టోబర్ 13న చిత్రం విడుదల కానున్నట్టు తెలియజేస్తూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్‌పై దూసుకుపోతుండగా, రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తున్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయనున్నాడు. వీరి సరసన ఒలీవియా మోరిస్, అలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.