బన్నీకి విజయ్‌ దేవరకొండ బహుమతి

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. పేరుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా స్టైలిష్‌‌గా ఉంటాడు. కనిపించిన ప్రతి సారి కొత్త కొత్త లుక్స్‌లో అభిమానులను అలరిస్తుంటాడు. అతని స్టైల్‌కు టాలీవుడ్‌తోపాటు దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా అల్లు అర్జున్‌ కొన్ని ఫోటోలను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. బ్లాక్‌​ జాగర్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్న బన్నీ లుక్స్‌ సోషల్‌​ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ఇవి బన్నీకి నటుడు విజయ్‌ దేవరకొండ బహుమతిగా అందించాడు. కాగా విజయ్ దేవరకొండకు తన స్పెషల్ డ్రెస్సింగ్ బ్రాండ్ “రౌడీ” ఉన్న సంగతి తెలిసిందే. ఆ బ్రాండ్ నుంచి బన్నీకి గతంలోనే విజయ్ కలెక్షన్‌ను పంపాడు. ఇప్పుడు మరోసారి కొన్ని కూల్ డ్రెస్ కలెక్షన్‌లను పంపి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక అల్లు అర్జున్‌ ఫోటోలను చూసిన నెటిజన్లు స్పెషల్ కలెక్షన్‌లో బన్నీ మరింత సూపర్ స్టైలిష్‌గా ఉన్నాడని కామెంట్‌ చేస్తున్నారు.

దీనిపై బన్నీ స్పందిస్తూ.. జాగర్‌ సెట్‌ను పంపించినందుకు విజయ్‌ దేవరకొండకు అలాగే తన రౌడీ బ్రాండ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశాడు. అదే విధంగా అల్లు అర్జున్‌ ట్వీట్‌పై విజయ్‌ దేవరకొండ స్పందించాడు. స్టన్నింగ్‌ అన్నో.. అంటూ తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా కనిపించనున్నారు. మరో వైపు ప్రస్తుతం విజయ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు.