విమర్శిస్తున్న వారిని కడిగిపారేసిన రోజా

సింగర్ సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితమే తన మొదటి భర్తతో విడాకులు చేసుకున్న ఆమె.. రీసెంట్‌గా వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుంది. జనవరి 9న శంషాబాద్‌లోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సునీత రెండో పెళ్లి టాపిక్ చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు సునీతపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ రచ్చకు దిగారు.

నిజానికి సునీత రెండో పెళ్లిని ఆమె ఇద్దరు పిల్లలు దగ్గరుండి మరీ జరిపించారు. కుటుంబ సభ్యులందరూ అనుమతించారు. అయినప్పటికీ కొందరు మాత్రం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆమె పెళ్లిపై సెటైర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే సినీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా సునీత మ్యారేజ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేయడంతో మరోసారి ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రోజా సునీతను విమర్శిస్తున్న వారిని కడిగిపారేస్తూ గట్టి కౌంటర్స్ వేశారు.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో తప్పేముందని పేర్కొంటూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. ఈ పెళ్లికి తన పిల్లలు, కుటుంబ సభ్యుల అనుమతే లభించాక అడగడానికి మీరెవరని ఆమె ప్రశ్నించారు. కొంతమంది పనిలేని వెదవలు సునీత పెళ్లి గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.. అలాంటోళ్ళు అసలు వాళ్లు మనుషులేనా? అంటూ రోజా మండిపడటం విశేషం. రెండో పెళ్లి నిర్ణయం అనేది సునీత వ్యక్తిగత విషయమని, దాన్ని విమర్శించే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.