రెమో డిసౌజాకి గుండెపోటు

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, ‘రేస్ 3’ ద‌ర్శ‌కుడు రెమో డిసౌజా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం ఆందోళన రేపింది. శుక్రవారం ఆయనకు గుండెపోటు వ‌చ్చింది. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. తమ అభిమాన కొరియోగ్రాఫర్‌ రెమో త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌ మీడియాలో సందేశాలు పోస్ట్‌ చేస్తున్నారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.

నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. రెమో ప్ర‌స్తుతం అత‌ను ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని రెమో భార్య లిజెల్‌ వెల్లడించారు. డాక్ట‌ర్లు అత‌నికి యాంజియోప్లాస్టీ నిర్వ‌హించారనీ, ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని తెలిపారు. కాగా డ్యాన్స్ ప్ల‌స్‌, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌, ఝ‌ల‌క్ దిఖ్లా జాలాంటి రియాల్టీ షోల‌లో జడ్జిగా కూడా వ్య‌వ‌హ‌రించారు.

వరుణ్ ధావన్ , శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ‘స్ట్రీట్ డాన్సర్ 3 డి’ ఆయన లేటెస్ట్‌ మూవీ. ముఖ్యంగా ఏబీసీడీ (ఎనీ బడీ కెన్‌ డాన్స్‌), ఏబీసీడీ 2, ఎ ఫ్ల‌యింగ్ జాట్ సినిమాల‌కు దర్శకత్వం నిర్వహించారు రెమో. బాజీరావ్ మ‌స్తానీ మూవీలోని దీవానీ మ‌స్తానీ పాట‌కుగాను అత‌డు 63వ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ కొరియోగ్ర‌ఫీ అవార్డును సొంతం చేసుకున్నారు.