రష్మిక మ్యూజిక్ ఆల్బమ్

రష్మిక మందన్నా.. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్‌. ‘సరిలేరు నీకెవ్వరు’ తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో వరుస ఆఫర్స్‌ దక్కించుకుంటోంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించింది. అక్కడ కూడా తన అందచందాలతో ప్రేక్షకుల మనసును దోచుకోవడానికి రెడీ అయింది.

ఇదిలా ఉంటే, తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించడం విశేషం. ‘టాప్ టక్కర్’ పేరుతో ఈ వీడియో ఆల్బమ్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ ఆల్బమ్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్‌షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ పాడారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్‌షానే రాయడం విశేషం. ఈ పాటలో రష్మిక మందన్న తలపై సిక్కు పాగాతో కొత్త అవతారంలో కేక పుట్టిస్తోంది. ‘టాప్ టక్కర్’కు సంబంధించిన పూర్తి పాటను త్వరలో విడుదల చేయనున్నారు.

కాగా, ‘టాప్‌ టక్కర్‌’ ఆల్బమ్‌ సాంగ్‌ గురించి చెబుతూ.. ‘మ్యూజిక్ ఆల్బమ్ లో నేను డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ అనుభవం బాగుంది. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కూడా. ఇది త్వరలో మీ ముందుకు రానుంది. ఇకపై పెళ్లిళ్లు, కాలేజీలు.. వంటి చోట ఈ ఆల్బమ్ వినిపిస్తుందనుకుంటున్నాను.. దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నను’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. ఇక సినిమా విషయాకొస్తే.. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.